Indian maritime trade relations  

భారతదేశ నౌకాయాన వ్యాపార సంబంధాలు.

పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. అందులోను పాత పుస్తకాలు చదవడమంటే ఇంకా ఇష్టం. జోరున వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే మనస్సుకు ఎంత ఉల్లాసంగా ఉంటుందో, పాత పుస్తకాలు చదవడం నాకు అంత ఉల్లాసంగా అనిపిస్తుంది.

ఈ నేపధ్యంలో ప్రాచీన భారతదేశ నౌకాయానం గూర్చి నేను చదివిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ దృష్టికి తెస్తున్నాను, ఇక చదవండి.

అతి ప్రాచీన కాలము నుండే మన భారతదేశానికి ఇతర దేశాలతో నౌకాయాన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇందులో భాగంగా అరబ్బులతో, రోమన్ ప్రజలతో, గ్రీకులతో, యూదులతో, ఇండియాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అని చెబుతారు. కానీ నేను ఒకడుగు ముందుకు వేసి మొసపొటమియా ప్రజలతో మనకు వ్యాపార సంబంధాలు వుండేవి అని చెప్పదలచాను.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన త్రవ్వకాల్లో ప్రస్తుతం లభించిన ఋజువులను బట్టి అతి ప్రాచీన నాగరికత మొసపొటమియా నాగరికత అని తేల్చారు పురావస్తుశాఖ అధికారులు మరియు చరిత్రకారులు. ప్రస్తుతం మనం దీన్ని ఇరాక్ అని పిలుస్తున్నాము.

కొడాలి లక్ష్మీనారాయణ రాసిన ప్రాచీన భారతీయ గ్రంథాలయ చరిత్ర అనే ఒక పాత పుస్తకంలో ఇలా ఉంది-భారతవర్షమునకు బాబిలోనియాకు గల వర్తక సంబంధము డా. సాయసీ (Dr. Sayce) లెక్క ప్రకారం క్రీ.పూ.3000 నుండి కలదని తెలియుచున్నది. క్రీ.పూ. 3000 క్రితము బాబిలోనియా మొదటి రాజు కాలమున “ఉర్” ఛాల్డియా, శిధిల భాగములలో భారతీయుల టేకు కొయ్య గాన్పించుట చేత, అప్పటికే సంబంధముగలదని కొందరి యూహ. బైబులును బట్టి క్రీ. పూ 1000 క్రితము పాలస్టయినాలో రాజ్యమేలిన యూదుల రాజగు, సోలమన్ (Solomon) అతని నావికులనుండి బంగారము, వెండి, విలువగలరాళ్ళు, సువాసన ద్రవ్యములు, చందనపు కొయ్యి, తోకలేని కోతులు, నెమళ్ళు, ప్రత్తిగుడ్డలు బహుమానముగా స్వీకరించుచుండెననియు తెలియ వచ్చుచున్నది. ఇందులో వెండి తప్ప మిగతవన్ని, మలబారులో సమృద్ధిగా గలవు (పుట-7).

సుమారుగా ఇదే విషయం ఇంగ్లీషు పుస్తకంలో ఇలా ఉంది- According to Dr. Sayce, the famous Assyriologist, the commerce by sea between India and Babylon must have been carried on as early as about 3000 b.c., when Ur Bagas, the first king of United Babylonia, ruled in Ur of the Chaldees. This is proved by the finding of Indian teak in the ruins of Ur. అనగా, ప్రముఖ అస్సీరియాలజిస్ట్ డా. సయిసీ చెబుతున్న దాని ప్రకారంగా, క్రీ.పూ.3000 యేళ్ళనాటి నుండే మొసపొటమియా నాగరికతతో భారతీయులకు వ్యాపార సంబంధాలు ఉండియుండవచ్చు. ఇండియాకు చెందిన ఒకప్పటి టేకుకలప మొసపొటమియా త్రవ్వకాల్లో లభించింది (A History Of Indian Shipping(1912) by Radhakumud Mookerji Publication date 1912) ( Pg 85).

క్రీ.పూ. 555 538 మధ్య కాలంలో మొసపొటమియాలోని ఊరు (Ur) అనే ప్రదేశంలో నెబుకద్నెజరు చక్రవర్తి చంద్రదేవత ఆలయాన్ని పున:నిర్మించాడు. అందులోని టేకు కలప నిస్సందేహంగా ఇండియానుండే ఎగుమతి అయ్యిందని కొందరు పరిశోధకులు రాసారు (Ibid-Pg-87).

ఇదే విధంగా పాత తెలుగు చరిత్ర పుస్తకాలను స్టడీ చేస్తే ఇంకో గొప్ప సంగతి తెలుస్తుంది. అదేమిటంటే, ప్రాచీన కాలమున అనగా, క్రీ.పూ 3000 నాడు ఈజిప్టు ప్రజలు శవాలకు (మమ్మీలకు) చుట్టే వస్త్రాలు మన ఇండియా నుండే అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళాయట. ఈ చరిత్ర వాస్తవాన్ని భాషా శాస్త్ర మూలసూత్రములు అనే గ్రంథంలో కొత్తపల్లి రంగారావు అనే పరిశోధకుడు రాసాడు, ఇది ఇలా ఉంది- తెలుంగులు (ద్రావిడులు)…..బాబిలన్ (క్రీ.పూ. 3000-1300) సామ్రాజ్యంతోనూ, పారసీక సామ్రాజ్యంతోనూ, చీనా జపాన్లతోనూ, వర్తకం చేసినట్లు పరస్పరం వలసలేర్పరచు కొన్నట్లు నిదర్శనాలున్నాయి….ప్రాచీన ఈజిప్టు మమ్మీలకు మన రవసెల్లాలు (సన్నని వస్త్రం) కప్పియుండడంవల్ల ఈ వర్తకం క్రీ.పూ 2-3 ఏళ్ళనుంచీ సాగుతున్నట్లు స్పష్టమవుతున్నది.

ఆ మధ్య నేను శ్రీ కోరాడ రామకృష్ణయ్య శత జయంతి సాహితీ నీరాజనం అనే మరో పుస్తకాన్ని చదువుతున్నాను. ఈ పుస్తకంలో ఇలా ఉంది- బైబిలు గ్రంథాన్ని బట్టి క్రీ.పూ.1000 సం. నాడే ఇండియా నుండి కలప, ఏనుగు దంతములు, సుగంధ ద్రవ్యాలు, నెమళ్ళు, వస్త్రాలు, ఈజిప్ట్ వర్తకులచే కొనిపోవుచుండెడివని తెలుపబడినది. ఇవి దక్షిణ దేశమునుండియే పోవుననుటకు ప్రబల నిదర్శనాలున్నవి. దీనిని బట్టి అతి ప్రాచీన కాలము నుండి భారతీయ వాణిజ్యమును నడిపిన వారిలో దక్షిణదేశమందలి ద్రావిడ జాతులందరును ప్రాముఖ్యము వహించినట్లు తెలియుచున్నది (Pg-209).

యూదుల గ్రంథమైన తాల్ముడు ఇలా చెబుతున్నది – క్రీ. పూ 10 వ శతాబ్దికాలంలో సొలొమోను నిర్మించిన దేవాలయంలో అతిపరిశుద్ధ స్థలం మీద సుమారు ఓ 19 రకాలైన సుగంధ ద్రవ్యాలు ధూపంగా వేయబడేవి. ఈ 19 రకాలైన సుగంధ ద్రవ్యాలలో ఓ రెండు మూడు రకాల సుగంధ ద్రవ్యాలు ఇండియా నుండి వెళ్ళేవట.

వరంగల్ జిల్లాలో లభించిన రోమన్ నాణెం.

వరంగల్ జిల్లాలోని పరకాల అనే ఊరిలో రోమన్ సామ్రాజ్యానికి చెందిన ఒక నాణెం త్రవ్వకాల్లో బయట పడిందట. నేను ఒక పాత న్యూస్ పేపరులో చదివాను. ఈ నాణెం క్రీ. శ.160 కాలం నాటిదట. వరంగల్ జిల్లా ప్రజలతో కూడా ఆనాటికాలపు రోమా ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవని రుజువవుతున్నది.

బైబిల్లో ఇండియా పేరు ఉందా?

అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను  (ఎస్తేరు 1:1).

ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఈ వాక్యానికి బైబిలు పండితులు పలు రకాలుగా వ్యాఖ్యానాలు ఇచ్చారు. ఈ వాక్యంలో హిందూదేశం అనగా పాకిస్తాను ప్రాంతాలు అని ఒక బైబిలు పండితుడు రాసాడు. (The name India here refers to the territory that is now western Pakistan).

ఇదేవిధంగా Zondervan Illustrated Bible Backgrounds Commentary Set అనే బైబిలు కామెంటరీలో కూడా ఇలా ఉంది. ఇందులోని వివరణ డైరెక్టుగా ఇక్కడ పెడుతున్నాను చదువుకొండి.

ఈరోజు ఉన్న ఇండియా భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి ఇండియా అని మాత్రం భావించనక్కరలేదు. ఎందుకంటే ఎస్తేరు కాలం నాటి ఇండియా భౌగోళిక స్వరూపం వేరు, ఇప్పటి ఇండియా భౌగోళిక స్వరూపం వేరు. ఈజిప్టులోని కూషు దేశం (ఆఫ్రికాలోని భాగం కావొచ్చు) మొదలుకొని ఏకంగ నూట ఇరవైయేడు ప్రాంతాలను అహష్వేరోషు పాలించాడు.

ఇక్కడ ఇంకో గొప్ప సంగతి ఏమిటంటే, Zondervan Illustrated Bible Backgrounds Commentary Set అనే బైబిలు కామెంటరీలో మన గోడీ గారి గూర్చి కూడా రాసారండోయ్…..!!!

ఓఫీరు అనేది ఇండియాయే అని కొంతమంది చెప్తారు. కానీ ఓఫీరు అనే ప్రదేశం ఎక్కడ ఉందో ఖచ్చితంగా చెప్పలేము. The exact location of Ophir is uncertain. Gold from there was shipped to Ezion Geber. Possibilities include South Arabia, India, or East Africa, the first being most probable (1 Chronicles 29:4, Zondervan Backgroun Bible Commentary).

ఏఏ రచయితలు ఇండియాను ఏఏ పేర్లతో పిలిచారు?

చరిత్ర పితామహుడైన హెరడోటస్ ఇండియాను ఇండోస్ అని పిలిచాడు. పారశీకులు హిందూ అని పిలిచారు. యూదులు హొడ్డు అని పిలిచారు. లాటినులో ఇండస్ అని అన్నారు. ఆ తదుపరి కాలంలో రూపాంతరం చెంది ప్రస్తుతం ఇండియా అని పిలుస్తున్నాము. ఇక్కడ ఋజువు పెట్టాను చూడండి.

ముగింపు:

బైబిలులో ఇండియా గూర్చి చెప్పబడినది. కానీ అవి ఇండియాలోని ఏఏ ప్రదేశాలో స్పష్టంగా చెప్పబడలేదు. ఐతే చరిత్ర పుస్తకాల్లో ఆసక్తికరమైన విషయాలు చాలా చదవవచ్చు. మద్రాసు, కేరళ, కృష్టాజిల్లా, మచిలీపట్నం మొదలైన ఓడరేవులకు కూడా రోమా నుండి కార్గో షిప్పులు వచ్చేవి. ఈ విషయాన్ని నేను స్పష్టంగా రాసాను. ఇదే వెబ్ సైట్ లో Christian Roots in Andhra Pradesh అనే నా పరిశోధనా వ్యాసాన్ని చదవండి. https://psureshbabu.com/christian-roots-in-andhra-pradesh/

అతి ప్రాచీన కాలంనుండే మొసపొటమియా, ఈజిప్ట్, గ్రీకు, రోమ్, పర్షియా లాంటి దేశాలతో మనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి.

హిందూదేశం అని ఉన్నంత మాత్రాన ఇదేదో మతపరమైన దేశంగా చెప్పబడినదని మనం భావించన్నక్కరలేదు. అతిప్రాచీన కాలం నుండే మన దేశం సెక్యులర్ కంట్రీగా అభివర్ణించబడినది. ప్రాచీన కాలం నుండే ఎన్నో దేశాల నుండి మనకు నౌకాయాన వ్యాపారాలు జరుగుతుండేవి, లేదా వస్తువులు ఎగుమతులు దిగుమతులు జరిగేవి కనుక, వస్తువులతో పాటుగానే పరాయి దేశ ప్రజల అలవాట్లు, అభిప్రాయాలు, నమ్మకాలు, సంస్కృతులు ఇండియాలో కలగాపులగం అయిపోయాయి. ప్రాచీన మొసపొటమియాలోని, ఈజిప్టులోని, పారశీక, రోమ్, గ్రీకు నాగరికతలలో వున్న కొన్ని అలవాట్లు సంప్రదాయాలు మన హిందూ దేశంలో కనబడతాయి. మనది మతపరమైన దేశం కాదు సెక్యులర్ దేశం.

వ్యాసకర్త: సురేష్ బాబు పురిటిగడ్డ – 8686357974

Endnotes:

1- కొడాలి లక్ష్మీనారాయణ రాసిన ప్రాచీన భారతీయ గ్రంథాలయ చరిత్ర

2-A History Of Indian Shipping (1912) by Radhakumud Mookerji Publication date 1912.

3-శ్రీ కోరాడ రామకృష్ణయ్య శత జయంతి సాహితీ నీరాజనం

4-Zondervan Illustrated Bible Backgrounds Commentary Set

5-A History Of Indian Civilization Vol-i (1958) by Mukerjee Radakamal. Publication date 1958

6-The geographical and topographical texts of the Old Testament: a concise commentary in XXXII chapters by Jan Jozef Simons.

7- ప్రాచీనాంధ్ర నౌకాజీవన చారిత్రము, భావరాజు వేంకట కృష్ణారావు 

error: Content is protected !!